ప్రభాస్ సినిమా ప్రమోషన్‌లో అపశృతి
హైదరాబాద్, డిసెంబర్ 18: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ నిధి అగర్వాల్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఈవెంట్ ముగిసిన అనంతరం బయటకు వెళ్లేందుకు నిధి అగర్వాల్ ప్రయత్నించగా, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీలు తీసుకోవాలనే ఉద్దేశంతో కొందరు అభిమానులు హద్దులు దాటడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గందరగోళంలో నిధి అగర్వాల్‌కు ఊపిరాడని పరిస్థితి నెలకొనగా, ఆమె తీవ్ర అసహనంతో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది.
పరిస్థితిని గమనించిన అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, నిధి అగర్వాల్‌ను సురక్షితంగా కారులోకి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సినీ సెలబ్రిటీల పట్ల అభిమానాన్ని వ్యక్తపరచే సమయంలో మర్యాద, భద్రత ముఖ్యమని పలువురు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళా నటుల విషయంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment