రెండు రోజుల్లో షాపు ఓపెనింగ్… అంతలోనే భారీ అగ్ని ప్రమాదం
మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్ పరిధిలోని లిమ్రా పరుపుల దుకాణంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజుల్లో ఘనంగా ప్రారంభించాల్సిన షాపు, ప్రారంభానికి ముందే అగ్నికి ఆహుతి కావడం స్థానికంగా కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, దుకాణానికి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌కు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ క్రమంలో స్పాంజ్ పరుపులపైకి ఎలక్ట్రిక్ వైరు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దుకాణం మొత్తం స్పాంజ్, ఫోమ్ సామగ్రితో నిండివుండటంతో క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చాయి.
మంటలు వ్యాపించడంతో దుకాణంలోని పరుపులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి స్పందించడంతో సమీప దుకాణాలకు మంటలు వ్యాపించకుండా నివారించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశం. అయితే, ఎంతో ఆశతో ప్రారంభించాల్సిన షాపు ఇలా కాలిపోవడంతో దుకాణ యజమాని ఖాదీర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి… రెండు రోజుల్లో ఓపెనింగ్ అనగా ఈ ప్రమాదం జరిగింది. నా కష్టమంతా కళ్ల ముందే కాలిపోయింది” అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Post a Comment