-->

తెలంగాణ రైజింగ్‌ 2047 లక్ష్యాల సాధనకు కఠిన దిశానిర్దేశం

తెలంగాణ రైజింగ్‌ 2047 లక్ష్యాల సాధనకు కఠిన దిశానిర్దేశం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి : సీఎం రేవంత్‌ రెడ్డి


హైదరాబాద్‌: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్ డాక్యుమెంట్‌ను కార్యరూపంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విజన్ డాక్యుమెంట్ కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా, ప్రతి శాఖ నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం సుమారు మూడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

క్యూర్, ప్యూర్, రేర్‌ విధానంలో అభివృద్ధి

రాష్ట్రాన్ని CURE (క్యూర్), PURE (ప్యూర్), RARE (రేర్) ప్రాంతాలుగా విభజించి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. గతంలో విద్యుత్‌, విద్య, నీటిపారుదల, ఆరోగ్య రంగాల్లో స్పష్టమైన పాలసీలు లేకపోవడం వల్ల సమస్యలు ఎదురయ్యాయని, అందుకే కీలక శాఖలకు ప్రత్యేక విధానాలను తీసుకొచ్చామని చెప్పారు.

పనితీరులో మార్పు రావాలి

లక్ష్యాల సాధనలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోమని సీఎం హెచ్చరించారు.

  • కార్యదర్శులు ప్రతి నెలా ప్రధాన కార్యదర్శికి నివేదికలు ఇవ్వాలి
  • ఐఏఎస్ అధికారులు ప్రతి పది రోజులకోసారి క్షేత్రస్థాయిలో పర్యటించాలి
  • నెలకు కనీసం మూడు సార్లు శాఖల పనితీరుపై పరిశీలన తప్పనిసరి

ఉద్యోగుల డేటా పూర్తి బాధ్యత అధికారులదే

ప్రభుత్వ విభాగాల్లో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న సుమారు 10 లక్షల మంది ఉద్యోగుల పూర్తి వివరాలను జనవరి 26లోగా సీఎస్‌కు అందించాలని ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఈపీఎఫ్ సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.

అద్దె భవనాలకు గుడ్‌బై

రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదని సీఎం స్పష్టం చేశారు.

  • జనవరి 26లోగా అద్దె భవనాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేయాలి
  • ప్రభుత్వ భవనాలు లేని చోట సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, అంగన్వాడీలకు సొంత భవనాలు కల్పించాలి

ఈ-ఫైలింగ్‌ తప్పనిసరి

జనవరి 31లోగా అన్ని శాఖల్లో ఈ-ఫైలింగ్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ తమ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక డాష్‌బోర్డ్ రూపొందించి సీఎస్‌, సీఎంఓ డాష్‌బోర్డుతో అనుసంధానం చేయాలన్నారు.

పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై నెలవారీ సమీక్ష

రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతవరకు భూమిపై అమలయ్యాయో ప్రతి నెలా సమీక్షించాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపుల కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.

విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి

  • కోర్ అర్బన్ ఏరియాల్లో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలి
  • రవాణా సదుపాయం, బ్రేక్‌ఫాస్ట్‌, మిడ్‌డే మీల్స్ ద్వారా విద్యార్థుల నమోదు పెంచాలి
  • అన్ని ప్రభుత్వ వైద్య కాలేజీల్లో టీచింగ్ హాస్పిటల్స్‌ను బలోపేతం చేయాలి
  • నిమ్స్ తరహాలో సనత్‌నగర్‌, కొత్తపేట, అల్వాల్ టిమ్స్‌, వరంగల్‌, ఉస్మానియా కొత్త ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి

కేంద్ర నిధుల సద్వినియోగం

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం ఆదేశించారు.

2047 నాటికి తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793