-->

విజయోత్సవ ర్యాలీలో విషాదం ఏడేళ్ల చిన్నారిపై నుండి వెళ్ళిన సర్పంచ్ కారు.. చిన్నారి మృతి

విజయోత్సవ ర్యాలీలో విషాదం ఏడేళ్ల చిన్నారిపై నుండి వెళ్ళిన సర్పంచ్ కారు.. చిన్నారి మృతి


వికారాబాద్ జిల్లా | పోడూరు మండలం | రాకంచర్ల గ్రామం వికారాబాద్ జిల్లా పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ తీవ్ర విషాదంగా మారింది. గ్రామ సర్పంచ్ కమ్లిబాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జరిగిన అపశృతిలో ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎలాంటి అనుమతి లేకుండానే డీజేతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన కుర్వా సౌజన్య (7) అనే చిన్నారి రోడ్డుపై ఉండగా, ర్యాలీలో పాల్గొన్న సర్పంచ్ కమ్లిబాయ్‌కు చెందిన కారు చిన్నారిపై నుండి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబసభ్యులు వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించి పంపించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి అంశాలపై లోతైన విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపగా, చిన్నారి మృతిపై పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793