-->

వసూళ్లకు పాల్పడిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్, సిగ్నేచర్ స్టూడియో రిపోర్టర్లు ముగ్గురు విలేకరులు

వసూళ్లకు పాల్పడిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్, సిగ్నేచర్ స్టూడియో రిపోర్టర్లు ముగ్గురు విలేకరులు


తొర్రూరు | డిసెంబర్ 31: క్రమాలు, అవినీతిని వెలికి తీసి సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన జర్నలిస్టులే వక్రమార్గంలో నడిచి కటకటాల పాలవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ వసూళ్లకు పాల్పడిన కేసులో తొర్రూరుకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తొర్రూరుకు చెందిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ పోల్ రాజు, టీ న్యూస్ రిపోర్టర్ శీలం సుమంత్, సిగ్నేచర్ స్టూడియో యాంకర్ జాటోతు ఉపేందర్ ఈ ముగ్గురు కలిసి ఈజీ మనీకి అలవాటు పడి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వీరు తమను తాము ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులుగా పరిచయం చేసుకుంటూ గ్రామాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీస్ సైరన్ అమర్చిన కారుతో అధికారుల మాదిరిగా హల్చల్ చేస్తూ, ప్రచార కార్యక్రమాల కోసం మద్యం తరలిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలను బెదిరించి పలు గ్రామాల్లో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా తొర్రూరు, పెద్దవంగర ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని వీరి దందాలు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.

లక్ష రూపాయల వసూళ్ల ఘటన

ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4.30 గంటల సమయంలో, ములుగు జిల్లా నివాసి ధరావత్ ఆనంద్ పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేసి కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో నిందితులు పోలీస్ సైరన్ ఉన్న కారుతో వెంబడించి అతడిని అడ్డగించారు.

తాము ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అని చెప్పి కారును తనిఖీ చేసి, మద్యం పట్టుకున్నామని కేసు పెడతామని బెదిరించారు. లక్ష రూపాయలు ఇస్తేనే వదిలేస్తామని ఒత్తిడి చేయడంతో బాధితుడు భయపడి తన బామ్మర్ది సహాయంతో అప్పటికప్పుడు రూ.లక్ష సమకూర్చి వారికి ఇచ్చి తప్పించుకున్నాడు.

ఆ సమయంలో జాటోతు ఉపేందర్ సివిల్ డ్రెస్‌లో ఉండగా, పోల్ రాజు, శీలం సుమంత్ అయ్యప్ప మాలలు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వివరాలు

జాటోతు ఉపేందర్ – సింగ్ మండలం వెలికట్ట శివారు పెద్దమంగ్యా తండా పరిధిలోని కేశ్య తండాకు చెందినవాడు. హైదరాబాద్‌లో సిగ్నేచర్ స్టూడియో యాంకర్‌గా పనిచేస్తున్నాడు.

పోల్ రాజు – పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందినవాడు. తొర్రూరు బస్టాండ్‌లో కార్గో పార్సెల్ సర్వీస్ నిర్వహిస్తూ, ఇటీవల నమస్తే తెలంగాణ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు.

శీలం సుమంత్ – వెంకటాపురం గ్రామానికి చెందినవాడు. టీ న్యూస్ రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

అరెస్టులు – స్వాధీనాలు

ఈ నెల 12న ఉపేందర్‌ను, 16న పోల్ రాజును, పరారీలో ఉన్న సుమంత్‌ను 29న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు.

నేరానికి ఉపయోగించిన కారుతో పాటు నగదు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉపేందర్ వద్ద నుంచి – రూ.50,000

పోల్ రాజు వద్ద నుంచి – రూ.25,000

శీలం సుమంత్ వద్ద నుంచి – రూ.25,000

మొత్తం నగదు మరియు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసుల హెచ్చరిక

జర్నలిస్టు ముసుగులో అక్రమ దందాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఉపేందర్ హెచ్చరించారు.

స్థానికుల స్పందన

నిజాయితీగా, నికార్సుగా పనిచేసే జర్నలిస్టుల ప్రతిష్టను మసకబార్చే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వర్గాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793