-->

భార్య విడాకుల నోటీసులతో మనస్తాపం.. ఉరేసుకుని భర్త ఆత్మహత్య

భార్య విడాకుల నోటీసులతో మనస్తాపం.. ఉరేసుకుని భర్త ఆత్మహత్య


ఘాట్‌కేసర్, డిసెంబర్ 24: భార్య పంపిన విడాకుల నోటీసుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘాట్‌కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో విషాదం నింపింది.

ఎదులాబాద్‌కు చెందిన వెంకటేష్ (40) కు, కీసరకు చెందిన మౌనికతో 2019లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వెంకటేష్ వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మౌనిక కీసర గురుకుల పాఠశాలలో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తోంది.

వివాహం జరిగినప్పటి నుంచి వీరికి సంతానం కలగకపోవడంతో పాటు, గత కొంతకాలంగా కుటుంబ విషయాలపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మౌనిక ఇటీవల కోర్టు ద్వారా విడాకుల నోటీసులు పంపించింది. ఈ విషయం వెంకటేష్‌ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటేష్ మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793