కాలంతో పోటీ – విజయానికి సమయమే కీలకం సబీరా నాజ్
గోదావరిఖని: జమాత్ ఇ ఇస్లామీ హింద్ (JIH) గోదావరిఖని యూనిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో 8 ఇంక్లైన్ కాలనీ కార్యాలయంలో నిర్వహించిన సదస్సుకు మహిళా విభాగం యూనిట్ అధ్యక్షురాలు సబీరా నాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఐషా సిద్ధికా, వైస్ ప్రెసిడెంట్ – మహిళా విభాగం, జమాత్ ఇ ఇస్లామీ హింద్, టెమ్రీస్ కౌన్సిలర్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆమె మాట్లాడుతూ, మానవ జీవితం ఎంతో అమూల్యమైనదని, అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. జీవితం దైవ రహస్యమని, దానిని ఛేదించే శక్తి ఎవరికీ లేదని అన్నారు. జీవితంలో సాఫల్యాలు, వైఫల్యాలు అన్నీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటామన్నదానిపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ ప్రపంచంలో డబ్బు, గౌరవం, ఉద్యోగం, అధికారం వంటి వాటిని సంపాదించవచ్చుగానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం ఎంత ధనం వెచ్చించినా తిరిగి పొందలేమని తెలిపారు. కాలం మనకోసం ఆగదని, దాని విలువను గుర్తించకపోతే అది నిర్దాక్షిణ్యంగా ముందుకు సాగిపోతుందని అన్నారు.
సమయాన్ని సమర్థవంతంగా వినియోగించినప్పుడే అది మనకు అనుకూలంగా మారుతుందని, ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయడం కాలానికి అవమానం చేసినట్టేనని ఆమె వ్యాఖ్యానించారు. చిన్న అలసత్వమే రేపటి బాధ్యతలను రెట్టింపు చేస్తుందని, చివరికి బాధ్యతల భారంతో పలాయనవాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
విజయవంతులైన వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే, వారు కాలాన్ని ఎలా తమకు అనుకూలంగా మలచుకుని కొత్త అవకాశాలను సృష్టించుకున్నారో అర్థమవుతుందని తెలిపారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ ఉదాహరణగా పేర్కొంటూ, అతను వెయ్యికి పైగా ఆవిష్కరణలు చేయగలిగాడంటే కారణం కాలాన్ని దుర్వినియోగం చేయక, ప్రతి క్షణాన్ని ప్రయోజనకరంగా వినియోగించడమేనని వివరించారు.
నేటి యువతలో కొందరు (అందరూ కాదని స్పష్టం చేస్తూ) స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా చాటింగ్‌లకు సమయాన్ని వృథా చేస్తున్నారని పేర్కొన్నారు. ఎడిసన్ తన ప్రయోగశాలనే వినోదశాలగా మలచుకుని, పని లోనే ఆనందాన్ని వెతికాడని గుర్తు చేశారు. విద్యుత్ బల్బు ఆవిష్కరణ కోసం వరుసగా పన్నెండు, పదమూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పట్టుదలే అతని విజయానికి కారణమని చెప్పారు.
కాలం విలువను గుర్తించి, విజయవంతుల గాధల నుంచి ప్రేరణ పొందాలని, విఫలమైన వారి అనుభవాలను గుణపాఠాలుగా తీసుకోవాలని ఆమె సూచించారు. బుద్ధిజీవిగా మానవుడు సమయం చెప్పే సత్యాలను అవగాహన చేసుకుని, నీతి, నిజాయితీ, విలువలతో కూడిన జీవితం గడిపితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు.
ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అందరికీ సకల శుభాలు, సంతోషాలు ప్రసాదించాలని, గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ వెలుగుల వైపు నడిపించాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఐషా సిద్ధిఖ (శిక్షణ కార్యదర్శి, 8 ఇంక్లైన్ కాలనీ), గౌహర్ అంజుమ్, జరీనా, హసీనా, ఫర్జానా, చాంద్‌బీ, తహ్మీనా, షాలినా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment