సింగరేణి క్వార్టర్స్ సమస్యలపై డైరెక్టర్ (పా)కు hms వినతిపత్రం
సింగరేణి / కొత్తగూడెం (కార్పొరేట్ ఏరియా): కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని క్వార్టర్స్‌లలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా మారింది. ఇవి కార్మికులపై దాడులు చేయడమే కాకుండా, ఎలక్ట్రిక్ వైర్లను ధ్వంసం చేయడం వల్ల తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అంతేకాక ఇండ్లలోకి చొరబడి విలువైన సామాగ్రిని నాశనం చేస్తూ సంస్థకు, కార్మికులకు భారీ నష్టం కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా హాస్పిటల్ ఏరియా పరిధిలోని నర్సెస్ హాస్టల్ వద్ద పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. గతంలో విధులకు వెళ్తున్న నర్సులు, స్కూల్‌కు వెళ్లే చిన్నారులపై కోతులు, కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటు చేసుకోగా, ప్రస్తుతం ఈ బెడద మరింత పెరిగి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మంచినీటి పథకం కింద కాలనీలో పైప్‌లైన్లు వేయడం కోసం రోడ్లను తవ్వడంతో అనేక ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని కార్మికులు హెచ్ఎంఎస్ యూనియన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో హెచ్ఎంఎస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జీఎం (వెల్ఫేర్) గారిని, డైరెక్టర్ (పా) గారిని కలిసి సమస్యలను వివరించుతూ వినతిపత్రం సమర్పించారు. స్పందించిన డైరెక్టర్ (పా) సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి వెంటనే సివిల్ జీఎం గారికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

Post a Comment