-->

కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం కలిగించవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

జర్నలిస్టుల సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించేలా మరింత మెరుగైన చర్యలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఆలోచిస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అక్రెడిటేషన్ ఉత్తర్వుల్లో ఉర్దూ జర్నలిస్టుల పట్ల వివక్షత, చిన్న పత్రికల పట్ల చిన్న చూపు చూపిన అంశాలను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ తీర్పుల నేపథ్యంలోనే కొత్త జీఓలో మార్పులు చేసినట్లు వెల్లడించారు.

నూతన జీఓపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ, సంక్షేమ చర్యలు కేవలం విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఈ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

అవసరమైతే ఈ అంశాలపై మరింత వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రితో, సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా చర్చించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

నూతన జీఓకు వ్యతిరేకంగా రాజకీయ ఎత్తుగడతో కొందరు ఆందోళనలకు దిగాలని ప్రయత్నించడం అత్యంత విచారకరమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో పరిష్కారాల దిశగా ముందుకెళ్తుందని, గత ప్రభుత్వంలా వివక్ష చూపే అవకాశం లేదని స్పష్టం చేశారు.

నూతన జీఓపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని వర్కింగ్ జర్నలిస్టులకు కె. శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793