పంచాయతీ ఎన్నికల అనంతరం వర్గాల మధ్య ఉద్రిక్తత.. అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి | డిసెంబర్ —16 : భిక్కనూరు మండలంలోని ఇస్సన్నపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంత్యక్రియల సందర్భంగా డప్పు కొట్టే అంశం వివాదాస్పదంగా మారి, చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో సమస్యకు పరిష్కారం లభించింది.
దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నప్పటికీ, వారిలో ఒకరిని గెలిపించకుండా మాల వర్గానికి చెందిన అభ్యర్థిని గెలిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గ్రామంలో జరిగే మంచి-చెడులకు డప్పు కొట్టేందుకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం తీసుకున్న రెండు రోజులకే గ్రామంలో ఒకరు మృతి చెందారు. అంత్యక్రియల సందర్భంగా డప్పు కొట్టేందుకు రావాలని గ్రామస్తులు కొందరు మాదిగ వర్గానికి చెందిన వారి ఇళ్లకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ముందే తీసుకున్న నిర్ణయాన్ని కారణంగా చూపుతూ వారు డప్పు కొట్టేందుకు నిరాకరించారు. చేసేదేమీ లేక చివరకు డీజే ఏర్పాటు చేసి మృతుడి అంత్యక్రియలను నిర్వహించారు.
ఈ వ్యవహారంపై గ్రామంలో అసహనం చెలరేగింది. ముందే నిర్ణయం తీసుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయకుండా సమయానికి ఇబ్బంది పెట్టారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఆ వర్గానికి చెందిన వారు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తే అమ్మవద్దని కొందరు గ్రామస్తులు నిర్ణయం తీసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు గ్రామంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కామారెడ్డి ఆర్డీఓ వీణ, భిక్కనూరు తహసిల్దార్ సునీత, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, సీఐ సంపత్ కుమార్, ఎస్‌ఐ ఆంజనేయులు సోమవారం సాయంత్రం హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.
అన్ని వర్గాల ప్రజలను పిలిపించి విస్తృతంగా కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరస్పర సహకారంతో మెలగాలని సూచించారు. అధికారుల చొరవతో ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడంతో గ్రామంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.

Post a Comment