చిక్కడపల్లిలో డ్రగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. చిక్కడపల్లి ప్రాంతంలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్న సుష్మిత (పేరు మార్చబడింది) తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన పోలీసులు చిక్కడపల్లి పరిధిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుష్మిత, ఇమాన్యుల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏ (MDMA), ఎల్‌ఎస్‌డీ (LSD) బాటిల్స్, ఒజి కుష్ (OG Kush) వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఐటీ రంగంలో పని చేసే యువతను, కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుందన్న దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు చర్యలు చేపట్టారు.
నగరంలో డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు కొనసాగుతాయని, ఎలాంటి స్థాయి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

Post a Comment