-->

మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు, నో రిజర్వేషన్.. 4 వేల ప్రత్యేక బస్సులు!

మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు, నో రిజర్వేషన్.. 4 వేల ప్రత్యేక బస్సులు!


హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రంగం సిద్ధమైంది. ఈ నెల జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు జాతర ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యంగా ఉండేలా దక్షిణ మధ్య రైల్వేతో పాటు టీజీఎస్‌ఆర్టీసీ కీలక ఏర్పాట్లు చేసింది.

28 ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అవసరం లేదు

మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మొత్తం 28 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లలో రిజర్వేషన్ అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
జనవరి 28 నుంచి 30 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలు:

  • సికింద్రాబాద్ – మంచిర్యాల (3 సర్వీసులు)
  • మంచిర్యాల – సికింద్రాబాద్ (3 సర్వీసులు)
  • సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (2)
  • సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ (2)
  • నిజామాబాద్ – వరంగల్ (4)
  • వరంగల్ – నిజామాబాద్ (4)
  • కాజీపేట – ఖమ్మం (4)
  • ఖమ్మం – కాజీపేట (4)
  • ఆదిలాబాద్ – కాజీపేట (1)
  • కాజీపేట – ఆదిలాబాద్ (1)

ఈ రైళ్లు మౌలాలి, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, ఆలేరు, జనగామ, ఘనాపూర్, కాజీపేట, వరంగల్, పెద్దపల్లి, రామగుండం తదితర స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

టీజీఎస్‌ఆర్టీసీ నుంచి 4 వేల ప్రత్యేక బస్సులు

మేడారం జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్‌ఆర్టీసీ ఏకంగా 4,000 ప్రత్యేక బస్సులను నడపనుంది.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 51 ప్రాంతాల నుంచి ఈ బస్సులు మేడారంకు రాకపోకలు సాగిస్తాయి.

ఈ ప్రత్యేక బస్సులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది.

మేడారంలో విస్తృత ఏర్పాట్లు

  • 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్
  • 9 కిలోమీటర్ల పొడవున 50 క్యూ లైన్లు
  • ఒకేసారి 20 వేల మంది నిలబడే అవకాశం
  • ప్రయాణికుల కోసం రెస్ట్‌రూములు, కుర్చీలు, తాగునీరు
  • 26 ఎకరాల్లో బస్సుల పార్కింగ్ సదుపాయం

మహిళలకు ఉచిత ప్రయాణం

మేడారం జాతరకు వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793