ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం మన్యం జిల్లా | జయ్యమ్మవలస మండలం పార్వతీపురం మన్యం జిల్లా జయ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో గురువారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మీనక మధు (35), ఆయన భార్య సత్యవతి (30), వారి కుమార్తె ఆయోష (6), నాలుగు నెలల పసికందు కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఒకే ఇంట్లో చిన్నారుల అమాయక ముఖాలు, తల్లిదండ్రుల నిర్జీవ దేహాలు కనిపించడంతో గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన వనజ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
ఈ ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుందనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Post a Comment