హాయ్‌తో మొదలైన పరిచయం.. రూ.2.14 కోట్లు కోల్పోయిన హైదరాబాద్ టెక్కీ
హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైబర్ మోసగాళ్ల చేతిలో భారీగా మోసపోయాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ చెప్పిన మాయమాటలు నమ్మి, నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టి ఏకంగా రూ.2.14 కోట్లు కోల్పోయిన ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం, టీఎన్‌జీవో కాలనీకి చెందిన 44 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గతేడాది డిసెంబరులో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ పరిచయమైంది. తాను స్టాక్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు పొందుతున్నట్లు నమ్మించిన ఆమె, ఓ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలని సూచించింది. ఆమె మాటలు నమ్మిన బాధితుడు ఆ యాప్‌లో పెట్టుబడులు పెట్టాడు.
డిసెంబర్ 12న తొలిసారిగా రూ.31.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, యాప్‌లో లాభాలు కనిపించడంతో మరింత పెట్టుబడి పెడితే ఇంకా అధిక లాభాలు వస్తాయని ఆమె ఆశ చూపింది. దీంతో రెండో విడతగా రూ.42.27 లక్షలు బదిలీ చేశాడు. అనంతరం లాభాలను విత్‌డ్రా చేసుకునే సమయంలో, లాభాల్లో 30 శాతం పన్ను యూఏఈ ప్రభుత్వానికి చెల్లించాలంటూ మోసగాళ్లు డిమాండ్ చేశారు.
యాప్‌లో కనిపిస్తున్న వర్చువల్ లాభాలను నిజమని నమ్మిన బాధితుడు, కార్యాలయ సహోద్యోగుల నుంచి సుమారు రూ.90 లక్షలు అప్పు తీసుకున్నాడు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సేకరించి, కొంత ఆస్తిని కూడా అమ్మి మొత్తం 8 విడతల్లో రూ.2.14 కోట్లు మోసగాళ్లకు బదిలీ చేశాడు.
చివరికి డబ్బు విత్‌డ్రా చేసుకునే ప్రయత్నంలో అదనంగా మరో రూ.68 లక్షలు చెల్లించాలని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. అనంతరం ఆ మహిళ ఫొటోను ఇంటర్నెట్‌లో పరిశీలించగా, అది ఇన్‌స్టాగ్రామ్‌లోని వేరొకరి ప్రొఫైల్ నుంచి దొంగిలించబడినదని తేలింది.
తాను నకిలీ ప్రొఫైల్‌తో మోసపోయినట్లు నిర్ధారించుకున్న బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment