-->

బీర్లు తాగి ఇద్దరు యువకుల మృతి.. జిల్లాలో విషాద ఘటన

బీర్లు తాగి ఇద్దరు యువకుల మృతి.. జిల్లాలో విషాద ఘటన


అన్నమయ్య జిల్లా | జనవరి 19: అతిగా బీర్లు సేవించిన కారణంగా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, కెవిపల్లి మండల పరిధిలోని బండ వడ్డీపల్లి గ్రామానికి చెందిన యువకులు ఈ ఘటనలో మృతి చెందారు.

శనివారం సాయంత్రం సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఒక చోట చేరి మద్యం సేవించారు. ఆరుగురు కలిసి మొత్తం 19 బీర్లను తాగినట్లు సమాచారం. ఈ క్రమంలో మణికుమార్ అనే యువకుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

వెంటనే అతడిని గర్నిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే మణికుమార్ మృతి చెందాడు.

ఇదే ఘటనలో మరో యువకుడు పుష్పరాజ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. అతడిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పుష్పరాజ్ కూడా మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. అతిగా మద్యం సేవించడం వల్లే మరణించారా, లేక మద్యంలో ఏవైనా మిశ్రమాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా, ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793