విశాఖ రైల్వేస్టేషన్‌లో నకిలీ కరెన్సీ పట్టివేత
విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ పోలీసులు చేపట్టిన సాధారణ తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు యువకులు పోలీసుల వలలో చిక్కారు.
వీరి వద్ద నుంచి మొత్తం రూ.3 లక్షల 32 వేల 200 విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం మొత్తం రూ.200 నోట్ల రూపంలో ఉన్న నకిలీ కరెన్సీగా గుర్తించారు.
పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీల్, అలాగే మార్కాపురం జిల్లా చెందిన నితీశ్ కుమార్‌గా గుర్తించారు. నకిలీ నోట్లను తరలిస్తున్న సమయంలోనే వీరు పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.
నకిలీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ఇదే తొలిసారి నేరమా, లేక గతంలోనూ నకిలీ కరెన్సీ సరఫరాలో పాల్గొన్నారు అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే వీరి వెనుక ఏదైనా నకిలీ నోట్ల ముఠా ఉందా అనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు వెల్లడించారు.

Post a Comment