జనగామ జిల్లాలో విషాదం.. వృద్ధ దంపతుల ఆత్మహత్య
జనగామ, (బచ్చన్నపేట): జనగామ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బచ్చన్నపేట మండలం చిన్న రామచర్ల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గ్రామానికి చెందిన రాంరెడ్డి, లక్ష్మి దంపతులు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకున్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఏమి చేయాలో తోచక అర్థరాత్రి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్సై హమిద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ దారుణ ఘటనతో చిన్న రామచర్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు దంపతుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Post a Comment