-->

బీర్కూర్‌లో కిచక వైద్యుడు… ఫార్మాసిస్టుపై లైంగిక వేధింపులు

బీర్కూర్‌లో కిచక వైద్యుడు… ఫార్మాసిస్టుపై లైంగిక వేధింపులు


కామారెడ్డి | జనవరి 07: కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఫార్మాసిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీర్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల విధుల్లో చేరిన డాక్టర్ లింగాల నాగ గిరీష్ కొద్దిరోజులుగా అక్కడే పని చేస్తున్న ఫార్మాసిస్టు (నర్స్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని) పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విధి సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగతంగా వేధింపులకు గురిచేయడం ద్వారా ఆమెను మానసికంగా హింసకు గురిచేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు.

డాక్టర్ ప్రవర్తన రోజురోజుకూ తీవ్రంగా మారడంతో తాను మౌనంగా ఉండలేకపోయినట్లు, మహిళగా తన గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించాడని బాధితురాలు వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు డాక్టర్ లింగాల నాగ గిరీష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మహిళా సిబ్బంది భద్రతపై ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ కూడా స్పందించే అవకాశం ఉందని సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793