-->

స్విట్జర్లాండ్‌కు చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

WEF–2026లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌కు చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జ్యూరిచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం


జ్యూరిచ్ / దావోస్: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారికి ఆత్మీయ స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలు, అంతర్జాతీయ సహకార అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది.

దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి గారి వెంట రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరోవైపు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ఇప్పటికే దావోస్‌కు చేరుకున్నారు.

దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం చురుకుగా పాల్గొననుంది. సమావేశాల తొలి రోజున వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్‌ను ప్రపంచ వేదికపై పరిచయం చేయనున్నారు.

రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, పరిశ్రమలకు అనుసంధానమైన మౌలిక సదుపాయాలపై ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు వివరించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. డిసెంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే WEF–2026లో తెలంగాణ అజెండాగా కొనసాగనుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793