-->

స్లీపర్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట స్లీపర్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న KVR ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలాల్లోకి బోల్తా పడింది.

బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అశ్వారావుపేట దాటి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.

ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. చీకట్లో ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బస్సుకు సరైన ఎగ్జిట్ డోర్లు లేకపోవడంతో లోపల అరుపులు, హాహాకారాలు వినిపించాయి.

నేషనల్ హైవే మీదుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పోలీస్ వాహనాలు, అంబులెన్సుల ద్వారా దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ ప్రాథమికంగా వెల్లడించగా, అసలు కారణాలపై రవాణాశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793