ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. భైంసా బస్ డిపో సమీపంలో కారు, కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు నిర్మల్ జిల్లా కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన బాబన్న, భోజరాం పటేల్, రాజన్న, వికాస్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం కారు అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment