రోడ్డు భద్రతపై వాహనదారులకు పోలీసుల అవగాహన
పెద్దపల్లి జిల్లా | జనవరి 19: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అలైవ్–అరైవ్’ పది రోజుల రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంథని పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం గంగపురి ప్రధాన రహదారిపై వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా గాడిదల గండి, ఆరెంద ఎక్స్ రోడ్, ఎక్లాస్పూర్ ఎక్స్ రోడ్, గంగపురి ఎక్స్ రోడ్ వంటి ప్రాంతాలను ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్‌స్పాట్‌లుగా పోలీసులు గుర్తించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా డీసీపీ రాంరెడ్డి, రామగుండం ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ రాజు గౌడ్, ఎస్సై డేగ రమేష్ పాల్గొని మాట్లాడారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాధాన్యత, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలు, మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే చట్టపరమైన సమస్యలపై అవగాహన కల్పించారు.
మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వాహనదారుడు దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే ప్రమాదరహిత సమాజం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అధిక సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు.

Post a Comment