మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. బుధవారం (జనవరి 21) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఫిబ్రవరి 11 లేదా 12 తేదీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేరోజు పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 లేదా 27న నోటిఫికేషన్ విడుదల చేసి, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం.
జనవరి 29 వరకు నామినేషన్లు స్వీకరించి, 30న వాటి పరిశీలన చేపట్టనున్నారు. 31న అభ్యంతరాల స్వీకరణ అనంతరం, ఫిబ్రవరి 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి సుమారు వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి అవకాశం కల్పించే యోచనలో ఉన్నారు.
ఇదిలా ఉండగా, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు అంశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలపై ఎన్నికల బరిలో దిగనున్న పార్టీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో పార్టీల అగ్రనేతలు ఆయా జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Post a Comment