గండిపేటలో కలకలం నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ పరిధిలోని హైదర్ షాకోట్ శాంతినగర్ కాలనీలో గురువారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు వేదాంత్ రెడ్డి పై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి.
ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నాలుగు వీధి కుక్కలు అతడిని చుట్టుముట్టి తీవ్రంగా కరిచాయి. ఈ దాడిలో బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
శాంతినగర్ కాలనీలో వీధి కుక్కల బెడదపై గత కొంతకాలంగా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ దారుణ ఘటనకు కారణమని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment