-->

ఇందిరా డెయిరీ ప్రాజెక్టు మహిళలకు పాడి పరిశ్రమలతో ఆర్థిక స్వావలంబన!

ఇందిరా డెయిరీ ప్రాజెక్టు మహిళలకు పాడి పరిశ్రమలతో ఆర్థిక స్వావలంబన!


హైదరాబాద్, జనవరి 02: తెలంగాణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా సంక్షేమ–అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడం, మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా మహిళల సాధికారతకు మరో కీలక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళల ఆదాయ వృద్ధి, స్వయం ఉపాధి, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా **‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’**ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండేసి పాడి గేదెలు లేదా ఆవులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం పాల కొరత తీవ్రంగా ఉంది. రోజుకు సుమారు 30 లక్షల లీటర్ల పాలు వినియోగం అవుతుండగా, ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాడి రైతుల నుంచి కేవలం 4 లక్షల లీటర్లే సరఫరా అవుతున్నాయి. మిగిలిన 26 లక్షల లీటర్ల పాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దాంతో ప్రభుత్వం ఇందిరా డెయిరీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ ప్రాజెక్టు కింద ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల యూనిట్ వ్యయంతో రెండు పాడి గేదెలు లేదా ఆవులు అందజేస్తారు. ఇందులో ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా, మిగిలిన రూ.60 వేల వరకు బ్యాంకుల ద్వారా రుణం అందించనున్నారు. అదనంగా, పాలు తరలింపునకు అవసరమైన ట్రాలీ ఆటోలను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీనిని కొడంగల్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

ఇందిరా డెయిరీ ప్రాజెక్టు అమలుకు మొత్తం రూ.781.82 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే రూ.286 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇంకా సుమారు రూ.370 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793