-->

పరకాల పట్టణ ప్రజల కష్టాలు తీరేనా?

బస్టాండ్ వద్ద ఫుట్‌పాత్ ఆక్రమణలతో పెరుగుతున్న ప్రమాదాలు


హన్మకొండ జిల్లా | జనవరి 08: పరకాల పట్టణంలోని బస్టాండ్ ప్రాంతం ప్రయాణికులకు రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. బస్టాండ్ పరిసరాల్లో రోడ్లను ఆక్రమించి పండ్ల వ్యాపారాలు నిర్వహించడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరకాల బస్టాండ్‌కు బస్సులు లోనికి, బయటికి వెళ్లే కీలక మూలమలుపుల వద్ద ఫుట్‌పాత్ వ్యాపారులు రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో పాదచారులకు నడవడానికి స్థలం లేకుండా పోయింది. ఫలితంగా బస్సు డ్రైవర్లకు పాదచారులు స్పష్టంగా కనిపించక, ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ 31న చోటుచేసుకున్న విషాద ఘటన

గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం ములుగు మండలం పల్సపల్లి గ్రామానికి చెందిన తోట రాధమ్మ పరకాల బస్టాండ్ వద్ద బస్సు లోనికి వెళ్లే మూలమలుపు దాటుతున్న సమయంలో బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన పట్టణాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.

ఈ విషాద ఘటన అనంతరం మున్సిపల్, ఆర్టీసీ అధికారులు స్పందించి, ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు ఆక్రమణలేనని గుర్తించారు. పాదచారుల భద్రత దృష్ట్యా బస్టాండ్ ముందు ఇనుప కంచె ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో ప్రమాదాల ముప్పు తగ్గడమే కాకుండా ప్రయాణికులకు కొంత భరోసా లభించింది.

కంచె తొలగింపు… మళ్లీ ప్రమాదాల ముప్పు

అయితే కేవలం ముగ్గురు ఫుట్‌పాత్ వ్యాపారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జోక్యం చేసుకున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కంచె వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో, బస్టాండ్ ముందు ఏర్పాటు చేసిన కంచెను తొలగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించినట్లు సమాచారం.

ఎమ్మెల్యే ఆదేశాలతో చేసేదేమీ లేక ఆర్టీసీ అధికారులు తక్షణమే కంచెను తొలగించారు. దీంతో మళ్లీ అదే పరిస్థితి నెలకొని, ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రశ్న: ముగ్గురి కోసం వేలాది మంది ప్రాణాలా?

“కేవలం ముగ్గురు వ్యాపారుల ప్రయోజనాల కోసం వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను గాలికి వదిలేస్తారా?” అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, బస్టాండ్ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పరకాల పట్టణ ప్రజల కష్టాలు ఎప్పటికైనా తీరతాయా? ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793