-->

బళ్లారిలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

బళ్లారిలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు


మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు వివాదమే కారణమా?

బళ్లారి (కర్నాటక): కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాలి జనార్దన్‌రెడ్డి కేంద్రంగా చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు విషయంలో చెలరేగిన వివాదమే ఈ ఘర్షణకు కారణమని ప్రాథమిక సమాచారం.

బళ్లారి ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడికి సంబంధించిన కార్యక్రమం సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో గాలి జనార్దన్‌రెడ్డి భద్రతా గన్‌మన్ తుపాకీని సతీష్‌రెడ్డి లాక్కుని కాల్పులు జరిపినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది రౌండ్ల కాల్పులు జరగగా, గాలి జనార్దన్‌రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఇరువర్గాల మధ్య పరస్పర కాల్పులు చోటు చేసుకోవడంతో ఘటన తీవ్ర రూపం దాల్చింది. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రూస్‌పేట ప్రాంతంలో గాలి జనార్దన్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బళ్లారి నగరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793