దగ్గు సిరప్‌ల అమ్మకాలపై కఠిన ఆంక్షలు – కేంద్రం ప్రతిపాదన
న్యూఢిల్లీ: దగ్గు సిరప్‌లను ప్రిస్క్రిప్షన్ లేకుండా కౌంటర్‌లో నేరుగా విక్రయించే విధానానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఓవర్ ద కౌంటర్ (OTC)గా అమ్ముడయ్యే దగ్గు సిరప్‌లపై కఠిన నియంత్రణలు విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
ఈ మేరకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ (సవరణ) రూల్స్, 2025కు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసి, ప్రజాభిప్రాయం కోరింది. ప్రతిపాదిత నిబంధనలపై 30 రోజులలోపు తమ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయాలని కేంద్రం కోరింది. ఆ తర్వాత అందిన సూచనలను పరిశీలించి, సవరించిన తుది నిబంధనలను అధికారిక గెజిట్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం చాలా దగ్గు సిరప్‌లు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో లభిస్తున్నాయి. దీనివల్ల చిన్నారులు, యువతలో దుర్వినియోగం పెరుగుతోందని, ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కోడీన్, డెక్స్ట్రోమెథార్ఫాన్ వంటి పదార్థాలు ఉన్న సిరప్‌లను నియంత్రించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటనలు నిలుస్తున్నాయి. కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్‌ను సేవించిన ఘటనలో మధ్యప్రదేశ్‌లో 26 మంది చిన్నారులు మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాణ్యతలేని ఔషధాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఔషధాల తయారీ, పంపిణీ, విక్రయాలపై మరింత కఠిన నియంత్రణలు అవసరమని కేంద్రం భావిస్తోంది. ప్రతిపాదిత నిబంధనలు అమలులోకి వస్తే, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు సిరప్‌ల విక్రయానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

Post a Comment