CMPF కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాలి – HMS యూనియన్ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 21: సింగరేణి సంస్థ లీజులో కొనసాగుతున్న CMPF కొత్తగూడెం కార్యాలయ స్థలాన్ని, సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసిన అనంతరం CMPF సిబ్బంది తమ కార్యాలయాన్ని ఖమ్మంకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని HMS యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా CMPF కార్యాలయం కొత్తగూడెంలోనే కొనసాగుతూ, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ప్రాంతాలు అలాగే సింగరేణి ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తోందని పేర్కొంది. అందరికీ సులభంగా అందుబాటులో ఉన్న CMPF కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి మార్చే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది.
ప్రస్తుతం CMPF కార్యాలయ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉందని చూపుతూ కార్యాలయాన్ని మార్చాలని చూస్తున్నారని, ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకుని ఆ స్థలాన్ని CMPF కార్యాలయానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని HMS యూనియన్ కోరింది.
గతంలో హైదరాబాద్‌లో ఉన్న CMPF కార్యాలయాన్ని సింగరేణి కార్మికులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కార్మిక సంఘాలు నిర్వహించిన ఉద్యమాల ఫలితంగానే గోదావరిఖని మరియు కొత్తగూడెంలో CMPF ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయబడిన విషయం గుర్తు చేసింది.
అందువల్ల CMPF కార్యాలయ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం CMPFకే కేటాయించి, CMPF కార్యకలాపాలు కొత్తగూడెంలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని HMS యూనియన్ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చింది. సింగరేణి కార్మికులందరికీ CMPF సేవలు సులభంగా అందుబాటులో ఉండాలంటే కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాల్సిన అవసరం ఉందని HMS జాగృతి స్పష్టం చేసింది.

Post a Comment