మృత్యుదారిగా మారిన భద్రాచలం–చర్ల రహదారి
భద్రాచలం; ఫిబ్రవరి 11: భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహదారి మరోసారి ప్రాణాన్ని బలిగొంది. లక్ష్మీనగరం సమీపంలో బుధవారం జరిగిన విషాద ఘటనలో చర్ల మండలంలోని సుబ్బంపేట పంచాయతీ పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన కొట్టెం కమల అక్కడికక్కడే మృతి చెందింది. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కమల ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ములకపాడు సెంటర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న గుంతలో బైక్ జారి పడింది. ఆమె కిందపడిన వెంటనే ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడుతో వచ్చిన లారీ అదుపు కోల్పోయి ఆమెపై నుంచి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. తీవ్ర గాయాలపాలైన కమల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సంఘటనను కళ్లారా చూసిన వారు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు దుస్థితి, ఎక్కడికక్కడ ఉన్న గుంతలు, అధిక వేగంతో వెళ్తున్న భారీ వాహనాలు, ట్రాఫిక్ నియంత్రణ లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. “ఇంకెంతమంది ప్రాణాలు పోతే అధికారులు మేల్కొంటారు?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కమల మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో భద్రాచలం–చర్ల రహదారి భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Post a Comment