అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్య అరెస్ట్.. జైలుకు తరలింపు
హనుమకొండ జిల్లాలో సంచలనం రేపిన అక్షర చిట్ ఫండ్ మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్షర చిట్ ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు శనివారం రాత్రి Kempegowda International Airport వద్ద అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న ఆమెను ఎయిర్‌పోర్ట్‌లోనే అదుపులోకి తీసుకుని హనుమకొండకు తరలించారు.
తదుపరి ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీవిద్యను నర్సంపేట జైలుకు తరలించినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ తెలిపారు.
అక్షర చిట్ ఫండ్ సంస్థలో చిట్టీలు వేసిన వందలాది మంది బాధితులకు గడువు పూర్తైనప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రావుపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గతంలో ఆయనను రెండు సార్లు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపినట్లు సమాచారం. మరో రెండు కేసుల్లో శ్రీనివాస్ రావు, ఆయన భార్య శ్రీవిద్య నిందితులుగా ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా అరెస్టుతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Post a Comment