-->

అరుదైన వివాహం: కవలల జంటల ఘనంగా పెళ్లి

 

కవలలైన ఇద్దరు యువకులు, కవలలైన ఇద్దరు యువతులను ఒకే ముహూర్తానికి వివాహం

నిజాంబాద్: జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కవలలైన ఇద్దరు యువకులు, కవలలైన ఇద్దరు యువతులను ఒకే ముహూర్తానికి వివాహం చేసుకోవడం విశేషంగా నిలిచింది. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజున ఈ వివాహ వేడుక జరగడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

కామారెడ్డి జిల్లా కేంద్ర శివారు లింగాపూర్‌లోని ఓ కల్యాణ మండపంలో ఈ అరుదైన వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి విజయ్‌కుమార్, వినయ్‌కుమార్‌లు కవలలు. వీరికి అదే జిల్లాలోని తాడ్వాయి మండలం దేమీకలాన్ గ్రామానికి చెందిన కవలలు కుమ్మరి కీర్తన, కీర్తిలతో పెద్దలు వివాహం నిశ్చయించారు.

బంధుమిత్రుల సమక్షంలో, వేదమంత్రాల నడుమ రెండు జంటలు ఒకే వేదికపై, ఒకే ముహూర్తంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు, అతిథులు కవలల జంటల పెళ్లిని చూసి ఆనందం వ్యక్తం చేశారు.

నవదంపతులు విజయ్‌కుమార్–కీర్తన, వినయ్‌కుమార్–కీర్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తుండటం మరో విశేషం. ఈ అరుదైన పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశమైంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793