కల్తీ పాల విషాదం: ఐదుగురి మృతి.. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం
ఆంధ్రప్రదేశ్‌లోని East Godavari district జిల్లాలోని Rajahmundry (రాజమహేంద్రవరం)లో కల్తీ పాలు తాగిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. తాజాగా చికిత్స పొందుతూ ఉన్న మంచి రాధాకృష్ణమూర్తి (74), యాళ్ల శేషగిరిరావు (72) సోమవారం కన్నుమూశారు. అంతకుముందు తాడి కృష్ణవేణి, కనకరత్నం సహా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉండగా, నలుగురు చిన్నారులు కూడా ప్రభావితమయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమించడంతో రాజమండ్రిలోని పిల్లల దవాఖానకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి సహా పలువురికి తీవ్రమైన డయేరియా, కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు బాధిత కుటుంబాలకు పాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని ఇళ్లకు పంపిణీ చేశారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను అప్రమత్తం చేశారు. బాధితుల నుంచి సేకరించిన రక్తం, మూత్ర నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
గత ఐదు రోజులలో 12 మందికి పైగా ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.

Post a Comment