-->

చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు గల్లంతు

చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు గల్లంతు


Jadcherla: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో గల్లంతు కావడంతో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన నవీన్ (30), యాదగిరి (26) అనే ఇద్దరు స్నేహితులు సాయంత్రం వేళ ఈత కొట్టేందుకు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో దూకిన అనంతరం వారు తిరిగి బయటకు రాకపోవడంతో అక్కడికి వచ్చిన గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, జడ్చర్ల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అప్పటికే చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపివేసి, సోమవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది మరియు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.

ఇప్పటివరకు ఇద్దరి ఆచూకీ లభించలేదు. ఆదివారం సాయంత్రం మద్యం మత్తులోనే ద్విచక్ర వాహనంపై చెరువు వద్దకు చేరుకున్నారని, వాహనం మరియు బట్టలను చెరువు ఒడ్డునే వదిలి నీటిలోకి దిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.

గల్లంతైన ఇద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారు. పెయింటర్‌లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నవీన్‌కు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామాన్ని కలచివేస్తున్నాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793