రంజాన్ మాసంలో జకాత్ – అదనపు పుణ్యము: ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి
గోదావరిఖని: జమాతే ఇస్లామీ హింద్ రామగుండం కార్పొరేషన్ మండల ఇంచార్జ్ ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి గారు గోదావరిఖనిలోని జమాత్ లైబ్రరీ, 8 ఇంక్లైన్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో “జకాత్” అంశంపై ప్రసంగించారు. రంజాన్ మాసంలో జకాత్ చెల్లించడం ద్వారా 70 రెట్లు అదనపు పుణ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
జకాత్ ప్రాముఖ్యత
జకాత్ ఇస్లాం ధర్మంలో ఫర్జ్ (తప్పనిసరి కర్తవ్యం)గా పేర్కొనబడిందని, పవిత్ర ఖుర్ ఆన్ లో జకాత్ గురించి అనేకసార్లు ప్రస్తావించబడిందని వివరించారు. అల్లాహ్ ప్రసాదించిన సంపదలో కొంత భాగాన్ని సమాజంలోని అవసరమైన వారికి ఖర్చు చేయడం ద్వారా సమాజంలో సమానత్వం స్థాపితమవుతుందని తెలిపారు.
జకాత్ అంటే ఏమిటి?
ఇస్లాం విశ్వసించిన ప్రతి ముస్లిం, తన అవసరాలు తీర్చుకుని మిగిలిన సంపదలో నూటికి 2.5% (1/40 వంతు) ధర్మప్రకారం దానం చేయుటే జకాత్ అని వివరించారు.
జకాత్ చెల్లించేందుకు అర్హతలు
జకాత్ విధి కావాలంటే:
- వ్యక్తి ముస్లిం అయి ఉండాలి
- ధనానికి యజమాని అయి ఉండాలి
- వయోజనుడై ఉండాలి
- వివేకవంతుడై ఉండాలి
- జీవనావసరాలకు మించిన సంపద కలిగి ఉండాలి
- ఋణగ్రస్తుడు కాకూడదు
- ఆ సంపదపై ఒక సంవత్సరం కాలం ఆధిపత్యం కలిగి ఉండాలి
ఎంత చెల్లించాలి?
- కనీస నిసాబ్ పరిమితి: సుమారు 72.5 తులాలు వెండి లేదా 7.5 తులాలు బంగారం (లేదా వాటికి సమానమైన నగదు విలువ).
- ఈ పరిమితికి మించిన ధనంపై సంవత్సరం పూర్తయిన తర్వాత 2.5% జకాత్ తప్పనిసరి.
- వ్యాపార పెట్టుబడులు, నగదు రూపంలో ఉన్న ధనం కూడా ఈ పరిధిలోకి వస్తాయి.
- వర్షాధార పంటలకు 10వ వంతు, నీటి సాయంతో పండించిన పంటలకు 20వ వంతు ఉష్ర్ చెల్లించాలి.
పశుసంపదపై జకాత్
గొర్రెలు/మేకలు:
- కనీసం 40 ఉంటే జకాత్ విధి.
- 40–120: 1 జంతువు
- 121–200: 2 జంతువులు
- 201–399: 3 జంతువులు
- 400: 4 జంతువులు
- ఆపై ప్రతి 100కి ఒకటి చొప్పున.
గేదెలు/ఆవులు:
- కనీసం 30 ఉంటే జకాత్ విధి.
- 30కు: 1 సంవత్సరం నిండిన దూడ
- 40కు: 2 సంవత్సరాలు నిండిన దూడ
- ప్రతి 30కు ఒక దూడ, ప్రతి 40కు రెండు సంవత్సరాల దూడ చొప్పున.
జకాత్ పరిధిలోకి రాని వస్తువులు
ఇండ్లు, వజ్రాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, గృహోపకరణాలు, వ్యక్తిగత వినియోగ వస్తువులు జకాత్ పరిధిలోకి రావు.
జకాత్ ఇవ్వడం ఎలా?
జకాత్ ఇస్తున్నప్పుడు స్పష్టమైన సంకల్పంతో ఇవ్వాలి. సంకల్పం లేకుండా ఇచ్చిన దానం సాధారణ సదఖాగా పరిగణించబడుతుంది కానీ జకాత్‌గా కాదు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ (అధ్యక్షుడు), అబ్దుల్ రజాక్ (ఉపాధ్యక్షుడు), కన్వీనర్ సిరాజుద్దీన్, అర్కాన్, కర్కునాన్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సిమ్స్ కళాశాల విద్యార్థులు, వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment