సహజీవనంలో అనుమానం… ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సహజీవనంలో నెలకొన్న అనుమానం ఘోర ఘటనకు దారితీసింది. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి అనంతరం తానూ అదే విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలో సంచలనం రేపింది.
ఈ ఘటన పట్టణంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… అంజయ్య భార్య రెండేళ్ల క్రితం మరణించగా, అనంతరం పద్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా సహజీవనానికి దారితీసినట్లు సమాచారం.
ఇటీవల పద్మ మరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానం అంజయ్యలో తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు తెలిసింది. గురువారం పద్మ తన తల్లి ఇంటికి ప్రగతి నగర్‌కు వచ్చిన విషయం తెలుసుకున్న అంజయ్య, పెట్రోల్ బాటిల్‌తో అక్కడికి వెళ్లాడు. “తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదు” అన్న ఆవేశంతో పద్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని స్థానికులు చెబుతున్నారు. అనంతరం తానూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడని సమాచారం.
అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పద్మకు భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజయ్యకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment