వివాహితపై ముగ్గురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామడుగు మండలం పరిధిలోని వెదిర గ్రామం లో ఓ వివాహితపై ముగ్గురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటన వివరాలు
బాధితురాలు తన తల్లి ఇంట్లో నివసిస్తోంది. ఈ నెల 16వ తేదీ రాత్రి తల్లి ఇంటి బయట తన చిన్న కుమార్తెతో కలిసి నిద్రిస్తున్న సమయంలో, అదే గ్రామానికి చెందిన అహ్మద్, వంచ సత్యనారాయణతో పాటు మరో వ్యక్తి వచ్చి ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు ఆరోపణ. అనంతరం ముగ్గురు కలిసి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై బాధితురాలు 18వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ప్రారంభంలో పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం మానవ హక్కుల సంఘం దృష్టికి వెళ్లడంతో పాటు సఖీ సెంటర్‌కు సమాచారం అందించారు.
కేసు నమోదు – దర్యాప్తు ప్రారంభం
తదనంతరం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పేద కుటుంబానికి చెందిన తనకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ స్పందించలేదని బాధితురాలు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారా లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Post a Comment