ఓటర్లకు దొంగ బంగారం.. నకిలీ వెండి పంపిణీ.. మున్సిపల్ ఎన్నికల వేళ కలకలం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో విచిత్ర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేయడం గమనార్హం. నకిలీ బంగారం, వెండి కాయిన్స్ పంపిణీ చేయడం వివాదాస్పదంగా మారింది.
సిరిసిల్లలో నకిలీ బంగారం పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వడ్నాల శ్రీనివాస్ ఓటర్లను ఆకర్షించేందుకు నకిలీ బంగారం పంపిణీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్కో ఓటరుకు మూడు గురజల బంగారం ఇస్తున్నానంటూ రాగి వస్తువులను బంగారంగా చూపించి పంపిణీ చేసినట్లు సమాచారం. విషయం బయటపడడంతో తమను మోసం చేశారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడ్చల్‌లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం
మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డులోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వెండి కాయిన్స్ పేరుతో ఓటర్లకు నకిలీ నాణేలు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పేరుతో ఈ కాయిన్స్ పంచినట్లు తెలుస్తోంది. నకిలీ నాణేలు అని తేలడంతో అభ్యర్థిపై ఓటర్లు మండిపడ్డారు.
కోరుట్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు
ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 24వ వార్డులో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎల్దీ శ్రీనివాస్ నివాసంలో 500కు పైగా వెంకటేశ్వర స్వామి వెండి ప్రతిమలు, 15 ఏసు క్రీస్తు వెండి ప్రతిమలు, పలు స్వీట్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే గడి బురుజు సమీపంలో వాహనాల తనిఖీల్లో భాగంగా ఒక వ్యక్తి వద్ద రూ.60,000 నగదు పట్టుబడింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై అధికారులు విచారణ చేపట్టారు.
ఎన్నికల వేళ ప్రలోభాలపై కట్టుదిట్టమైన చర్యలు
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం చట్టవిరుద్ధమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ నకిలీ బంగారం, వెండి పంపిణీ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Post a Comment