సంతలో ఐదు తులాల బంగారు నగలు చోరీ.. రూ.8 లక్షల నష్టం
మెదక్: సంతలో ఐదు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం మాంబోజీపల్లి గ్రామానికి చెందిన కొల్చారంకు చెందిన చింతలగారి దంపతులు శ్రావణి, ప్రవీణ్ మెదక్‌కు వచ్చి తిరుగు ప్రయాణంలో స్థానిక సంతలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచిన సుమారు రూ.8 లక్షల విలువ గల ఐదు తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి.
చోరీకి గురైన నగల్లో 2.5 తులాల నెక్లెస్, 2 తులాల నల్లపూసలు, అర తులం మాటీలు, చెవి కమ్మలు ఉన్నట్లు వారు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత హ్యాండ్‌బ్యాగ్‌ను పరిశీలించగా నగలు కనిపించకపోవడంతో వారు కంగుతిన్నారు.
ఈ ఘటనపై బాధితులు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై లింగం దర్యాప్తు ప్రారంభించారు. సంత ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంతల్లో ఇటువంటి చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Post a Comment