రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
కామారెడ్డి జిల్లా: ఏప్రిల్ 17: కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారిపై ఏసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా పనిచేస్తున్న సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
వివరాల్లోకి వెళ్తే, ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకాణాన్ని మరో గ్రామానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని సీఐ సత్యనారాయణ బాధితుడిని డిమాండ్ చేశాడు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, సత్యనారాయణ లంచం స్వీకరిస్తున్న సమయంలో అతడిని పట్టుకున్నారు. అనంతరం అతని నివాసంలో సోదాలు నిర్వహించగా అదనంగా రూ.45,670 నగదు లభ్యమైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
ఈ సంఘటనతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగగా, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment