మహిళా 33% రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్!
భారత రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయాల్సిన మహిళా 33% రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభలో అడ్డంకులు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయింది.
ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది సభ్యులు, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ (కనీసం 352 ఓట్లు) రాకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు.
దీంతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన ఇతర రెండు కీలక బిల్లులు—నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2026—ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఈ పరిణామంతో లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదనకు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఓటింగ్ అనంతరం సభను స్పీకర్ శనివారానికి వాయిదా వేశారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిల్లులో మార్పులు చేస్తే మద్దతు ఇస్తారా అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, మూడింట రెండొంతుల మెజారిటీకి సుమారు 360 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు ఉండగా, అవసరమైన సంఖ్యకు గణనీయంగా తక్కువగా ఉంది. అలాగే రాజ్యసభలో కూడా ఎన్డీఏకు పూర్తి మెజారిటీ లేదు.
ఇక నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానాల పెంపుతో తమకు అన్యాయం జరుగుతుందనే భావన వ్యక్తమవుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎవరికీ అన్యాయం జరగదని, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేసింది.

Post a Comment