-->

హైదరాబాద్‌లో అకాల భారీ వర్షం.. వడగళ్ల వానతో జనజీవనం అస్తవ్యస్తం

హైదరాబాద్‌లో అకాల భారీ వర్షం.. వడగళ్ల వానతో జనజీవనం అస్తవ్యస్తం


హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ ప్రాంతాల్లో మొదలైన వర్షం క్రమంగా కూకట్‌పల్లి, మియాపూర్‌, చందనగర్ ప్రాంతాలకు విస్తరించి కుండపోతగా మారింది.

కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, షాపూర్‌, చింతల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా, మణికొండ, గచ్చిబౌలి, కొంపల్లిలో వడగళ్ల వాన పడింది. ఆకస్మికంగా మారిన వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద వాహనాలను నిలిపి వాన నుంచి తాత్కాలికంగా రక్షణ పొందేందుకు ప్రయత్నించారు.

ఇక కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో గాలివానతో పాటు భారీ వడగళ్ల వర్షం కురవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు వర్షానికి చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులు ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793