లాడ్జిపై పోలీసుల దాడి – వ్యభిచారం కేసులో నలుగురు అదుపులోకి
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జిపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, ఉండవెల్లి మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి సమీపంలోని వికేర్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్న గీతా లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందనే నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. దీంతో మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఎస్సై తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ముగ్గురు పురుషులు, ఒక మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన వారు ఇటిక్యాల మండలంలోని బుడారెడ్డిపల్లి, కోదండపురం గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మహిళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాకు చెందినదిగా వెల్లడించారు.
పట్టుబడిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను గద్వాల సఖి కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురితో పాటు లాడ్జి యజమాని పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో ఉండవెల్లి ప్రాంతంలో పోలీసులు అక్రమ కార్యకలాపాలపై మరింత కఠిన చర్యలు చేపడుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment