ఆదిలాబాద్‌లో కత్తితో వ్యక్తి హల్‌చల్
ఆదిలాబాద్, మార్చి 03, 2026: ఆదిలాబాద్ పట్టణంలో స్థిరాస్తి వ్యాపార లావాదేవీల వివాదం తీవ్ర రూపం దాల్చి హత్యాయత్నానికి దారితీసిన ఘటన కలకలం రేపింది. వాటా విషయంలో తలెత్తిన వివాదంతో ఒక వ్యక్తి తన భాగస్వామిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
బాధితుడు జయప్రకాష్ జైస్వాల్ ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఖానాపూర్ కు చెందిన ఖలీస్ రంజానీ తన కుమారుడితో కలిసి విద్యానగర్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో జయప్రకాష్‌పై కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో జయప్రకాష్‌కు వేలికి, కడుపు భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
దాడి అనంతరం నిందితులు పరారయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన విభేదాలే ఈ దాడికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Post a Comment