-->

గల్ఫ్‌లో మృతి చెందిన యువకుడు… స్వగ్రామంలో విషాదఛాయలు

గల్ఫ్‌లో మృతి చెందిన యువకుడు… స్వగ్రామంలో విషాదఛాయలు


కోరుట్ల రూరల్: కుటుంబ కష్టాలు తీరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని ఆశించిన ఓ యువకుడి కలలు మధ్యలోనే చిద్రమయ్యాయి. నాలుగు రూపాయలు సంపాదించి కుటుంబాన్ని నిలబెట్టాలని భావించి గల్ఫ్ వెళ్లిన అతడు, చివరకు విగతజీవిగా పెట్టెలో తిరిగి రావడం హృదయ విదారకంగా మారింది.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెల మధు (33) ఉపాధి కోసం కొంతకాలం క్రితం ఖతార్‌కు వెళ్లాడు. అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉండగా అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్లు సమాచారం.

సోమవారం మధు భౌతికకాయం స్వగ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతదేహం ఇంటికి చేరగానే భార్య ఆర్తనాదాలు, ముగ్గురు చిన్నారుల రోదనలు హృదయాలను కదిలించాయి. తండ్రి ఇక లేడన్న విషయం తెలియని ఆ చిన్నారుల అమాయక చూపులు అందరినీ కలచివేశాయి.

కుటుంబానికి అండగా ఉండాల్సిన మధు అకాల మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793