-->

సామరస్య పతాక.. ఐక్యతా ప్రతీక ఈదుల్ ఫితర్

సామరస్య పతాక.. ఐక్యతా ప్రతీక ఈదుల్ ఫితర్


గోదావరిఖని: రమజాన్ నెల ముగింపు సందర్భంగా జరుపుకునే ఈదుల్ ఫితర్ పండుగ సామరస్యం, ఐక్యత, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని రామగుండం కార్పొరేషన్ మండల ఇన్‌చార్జ్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ తెలిపారు. జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ సందేశం ఇచ్చారు.

ఈదుల్ ఫితర్ కేవలం పండుగ కాకుండా ఆత్మపరిశుద్ధత, ఉపవాసం, దానం, సహనం వంటి విలువలను ప్రతిబింబించే ఆధ్యాత్మిక ఉత్సవమని పేర్కొన్నారు. ఉపవాసం ద్వారా మనిషి తనలోని దుర్గుణాలను జయించి దైవభక్తి పెంపొందించుకుంటాడని తెలిపారు.

పండుగలో భాగంగా ‘సదఖా-ఎ-ఫిత్ర్’ ద్వారా పేదలకు సహాయం చేయడం సామాజిక సమానత్వాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. ఈద్ ప్రార్థనల్లో అందరూ సమానంగా నిలబడి ప్రార్థించడం ఐక్యతకు నిదర్శనమన్నారు.

ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న విభేదాల మధ్య ఈద్ పండుగ శాంతి, ప్రేమ, సహజీవనం సందేశాన్ని అందిస్తుందని, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుందని వివరించారు. ఈద్ సందర్భంగా పరస్పర గౌరవం, సహనం, మానవతా విలువలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మౌలానా రఫీక్ ఖాస్మీ, మక్సూద్ అహ్మద్ ఖాన్, నసీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793