సికింద్రాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు
సికింద్రాబాద్, మార్చి 23: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈగిల్ టీమ్ మరియు ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి తరలింపును అడ్డుకున్నారు.
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారు దీపక్ సాహూ (26), దీపక్ గౌడ (20)గా గుర్తించారు. వీరు ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు.
నిందితులు గజపతి అటవీ ప్రాంతాల్లో నుంచి గంజాయిని కొనుగోలు చేసి, రైలుమార్గం ద్వారా ఢిల్లీకి తరలించే ప్రయత్నంలో ఉండగా, సికింద్రాబాద్ స్టేషన్‌లో తనిఖీల సమయంలో పట్టుబడ్డారు.
వారి వద్ద నుంచి సుమారు 10.089 కిలోల డ్రై గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ. 5 లక్షలుగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రాకెట్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు.

Post a Comment