రోడ్డుపై దొరికిన బంగారం.. నిజాయితీతో తిరిగి అప్పగించిన టీ స్టాల్ నిర్వాహకులు
మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు అధికమవుతున్న వేళ, కొందరి మంచితనం మాత్రం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.
అల్లాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు తన కుమార్తె వివాహం కోసం బంగారు నగలను తీసుకుని దొంతి గ్రామానికి వెళ్తుండగా, బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనం నుంచి నగలతో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. అయితే ఈ విషయం ఆయనకు తెలియకుండా ముందుకు వెళ్లిపోయారు.
అదే సమయంలో రోడ్డుపై పడిపోయిన ఆ బ్యాగ్‌ను గమనించిన టీ స్టాల్ నిర్వాహకులు నాగరాజు, కృష్ణ దాన్ని తీసుకున్నారు. బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో సుమారు తొమ్మిది తులాల బంగారు నగలు ఉండటం గమనించారు. అయినప్పటికీ ఎలాంటి ఆశ పడకుండా వారు వెంటనే తూప్రాన్ పోలీసులకు సమాచారం ఇచ్చి బ్యాగ్‌ను అప్పగించారు.
పోలీసులు బ్యాగ్‌ను యజమాని నరసింహులకు అప్పగించగా, ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజాయితీగా వ్యవహరించిన నాగరాజు, కృష్ణలను తూప్రాన్ డీఎస్పీ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సంఘటనతో సమాజంలో ఇంకా నిజాయితీ, మంచితనం ఉన్నాయన్న నమ్మకం మరోసారి బలపడింది.

Post a Comment