-->

ట్రాక్టర్ బోల్తా… ఉపాధి కూలి ఒకరు మృతి 25 మంది తీవ్ర గాయాలు

ట్రాక్టర్ బోల్తా… ఉపాధి కూలి ఒకరు మృతి 25 మంది తీవ్ర గాయాలు


తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం పేద కూలీల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉపాధి పనుల కోసం వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పెనగలూరు మండలం వెలగచర్ల గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు ఉదయం 10 గంటల సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ అతివేగంగా నడపడంతో వాహనం ఒక్కసారిగా నియంత్రణ తప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది.

ట్రాక్టర్ కింద కూలీలు చిక్కుకోవడంతో ఘటన స్థలం ఆర్తనాదాలతో మార్మోగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
సమాచారం అందుకున్న పెనగలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో బాధితుల గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793