-->

పెట్రోల్ బంకుల్లో కూలర్ల ఏర్పాటు – ఎండల తీవ్రతకు వినూత్న చర్యలు

పెట్రోల్ బంకుల్లో కూలర్ల ఏర్పాటు – ఎండల తీవ్రతకు వినూత్న చర్యలు


అదిలాబాద్ జిల్లా: ఏప్రిల్ 16: అదిలాబాద్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి 44 డిగ్రీలకుపైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డెక్కితే చాలు మండుటెండలు, వడగాలులు కలిసి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తీవ్ర వేడి ప్రభావంతో రహదారులపై వెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటుండగా, కొన్ని చోట్ల పెట్రోల్ వాహనాలు కూడా అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానులు అప్రమత్తమయ్యారు. ఎండల ప్రభావం నుంచి మిషన్లను రక్షించేందుకు, అగ్నిప్రమాదాలు నివారించేందుకు బంకుల్లో కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామంలోని ఓ ప్రైవేట్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పెట్రోల్, డీజిల్ మిషన్ల వద్ద ప్రత్యేకంగా కూలర్లను అమర్చారు. మధ్యాహ్న సమయంలో అధిక వేడి కారణంగా మిషన్లు వేడెక్కకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. మిషన్ ప్యానల్స్‌ను ఓపెన్ చేసి వాటి దగ్గర కూలర్లు ఏర్పాటు చేయడం ద్వారా యంత్రాలు పాడవకుండా కాపాడుతున్నట్లు చెప్పారు.

చించోలి మాత్రమే కాకుండా నిర్మల్ రూరల్, లక్ష్మణచందా, దిల్వార్‌పూర్ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో కూడా ఇదే తరహా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఇలా కూలర్ల ద్వారా మిషన్లను చల్లగా ఉంచకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు.

పెట్రోల్ కోసం వచ్చే వాహనదారులు కూడా ఈ ఏర్పాట్లతో కొంత ఉపశమనం పొందుతున్నారు. కాసేపు చల్లదనంలో సేద తీరుతూ బంక్ నిర్వహకులను అభినందిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793